: ఏపీకి ప్రత్యేక ప్రాధాన్యత, గుర్తింపు ఇవ్వాలన్నది మోదీ ఉద్దేశం: వెంకయ్యనాయుడు


రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అందరం కలసికట్టుగా పనిచేసి ఏపీని అగ్ర రాష్ట్రంగా అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా లాంఫాంలో ఇవాళ నిర్వహించిన వ్యవసాయ విశ్వవిద్యాలయం శంకుస్ధాపన కార్యక్రమంలో వెంకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగానికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఏపీకి ప్రత్యేక ప్రాధాన్యత, గుర్తింపు ఇవ్వాలన్న ఉద్దేశం ప్రధాని నరేంద్రమోదీకి ఉందని స్పష్టం చేశారు. కొత్త రాజధానికి కేంద్రం నుంచి అన్ని సహాయ సహకారాలు అందుతాయని చెప్పారు. పోలవరం ముంపు మండలాలు ఏపీలో కలిపిన ఘనత మోదీదేనని పేర్కొన్నారు. విజయవాడలో దుర్గగుడి పైవంతెన నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతుందని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం తరువాత రాష్ట్రానికి లోటును కేంద్రమే భర్తీ చేస్తుందని, విశాఖ, చెన్నై గ్రోత్ కారిడార్ తో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని వివరించారు. దేశంలో అసహనం పెరిగిపోయిందని ప్రతిపక్షాలు అనవసరంగా విమర్శిస్తున్నాయని, మోదీ ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని వెంకయ్య మండిపడ్డారు. 2024 వరకు దేశానికి ప్రధానిగా మోదీయే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News