: వారి సొమ్ముతో జల్సాలు, అందుకే ఉగ్ర దాడులు: ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఫ్రాన్స్ రాజధాని పారిస్ పై జరిగిన ఉగ్రదాడిని గుర్తు చేస్తూ, యూపీ మంత్రి ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిరియా, ఇరాక్ తదితర దేశాల్లోని చమురు క్షేత్రాలను ఆక్రమించి, ఆ డబ్బుతో పారిస్ లో జల్సాలు చేసిన రోజున, ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదా? అని ఆజంఖాన్ ప్రశ్నించారు. ఐఎస్ఐఎస్ అడ్డాలుగా భావించి, వైమానిక దాడులు చేస్తూ అమెరికా, దాని మిత్రదేశాలు అమాయకులను బలి చేస్తున్నాయని ఆరోపించారు. అగ్రరాజ్యాలు తమపై చేస్తున్న దాడులకు ప్రతీకారంగానే ఉగ్రదాడులు జరుగుతున్నాయని, ఈ తరహా ఘటనలు దురదృష్టకరమని ఆయన అన్నారు. చమురు నిల్వలను దోచుకుని, ఆ డబ్బుతో యూరప్ దేశాల్లో దీపాలను వెలిగించుకోవడం తగదని హితవు పలికారు.