: ప్లీజ్ ఎలాగైనా తప్పించుకో... ప్రియురాలి ఎస్సెమ్మెస్: 'అలాగే చేస్తా'నంటూ తిరిగిరాని లోకాలకు నటుడు బాల ప్రశాంత్!
వర్ధమాన సినీ నటుడు బాల ప్రశాంత్ మృతి వెనుక అక్రమ సంబంధం బయట పడుతుందన్న భయం, తొందరపాటు, దురదృష్టం దాగున్నాయని పోలీసులు తేల్చారు. ఓ అపార్ట్ మెంట్ నుంచి కిందపడి ఆయన మరణించిన సంగతి తెలిసిందే. ఓ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు అసలు విషయాన్ని బయటకు లాగారు. ఆయన తన వివాహిత ప్రియురాలు ఇంటికి వచ్చాడని, అక్కడి నుంచి బయటకు పారిపోయేందుకు యత్నించి ప్రమాదవశాత్తు మరణించాడని తెలిపారు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, రెండేళ్ల నుంచి ఓ వివాహిత యువతికి, మూసాపేటలో డ్యాన్స్ స్కూలు నిర్వహిస్తుంటే బాల ప్రశాంత్ కు దగ్గరి పరిచయం ఉంది. ఈ నెల 13న ఆమె భర్త ఓ ఫంక్షన్ నిమిత్తం వెళ్లగా, ప్రియుడు బాల ప్రశాంత్ ని ఆమె ఇంటికి ఆహ్వానించింది. అయితే, ఆమె భర్త, తాను ఇంట్లో లేనని, తన ఇంటికి వెళ్లి అక్కకు తోడుగా ఉండాలని బావమరిదికి ఫోన్ చేసి చెప్పాడు. తన తమ్ముడిని ఇంట్లోకి రానివ్వని ఆ యువతి, నిద్రపోతున్నానని చెప్పి వెనక్కి పంపింది. ఆపై అనుమానం వచ్చిన భర్త, తన అక్కా, బావలను పంపాడు. వారు వచ్చిన సమయంలో బాల ప్రశాంత్ ఇంట్లోనే ఉండటంతో ఏం చేయాలో పాలుపోని ఆ వివాహిత, ప్రియుడిని మంచం కింద దాక్కోపెట్టి, పదేపదే ఇంటికొచ్చి తనను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపిస్తూ, చేతులు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ వెంటనే వారు ఆమెను ఆసుపత్రికి తరలించగా, తన సెల్ ఫోన్ ద్వారా "ప్లీజ్ ఎలాగైనా తప్పించుకో" అని బాల ప్రశాంత్ కు మెసేజ్ పెట్టింది. అతన్నుంచి "అలాగే చేస్తా" అంటూ రిప్లయ్ కూడా వచ్చింది. ఈ క్రమంలోనే ఇంటి నుంచి బయటపడేందుకు యత్నించి కిందపడి మరణించాడని పోలీసులు తెలిపారు.