: సోమవారం భారీ నష్టం... మార్కెట్ విశ్లేషకుల ముందస్తు అంచనాలు!
పారిస్ పై ఉగ్రవాదుల దాడుల తరువాత ప్రపంచవ్యాప్త స్టాక్ మార్కెట్లలో స్వల్పకాల అమ్మకాల వెల్లువ నమోదు కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో సోమవారం నాటి సెషన్లో భారీ నష్టం నమోదు కావచ్చని టోక్యో కేంద్రంగా పనిచేస్తున్న దైవా సెక్యూరిటీస్ చీఫ్ టెక్నికల్ అనలిస్ట్ ఈజీ కినౌచీ అంచనా వేశారు. అయితే, పతనం నమోదైనా, అది తాత్కాలికమేనని ఆయన తెలిపారు. ఫ్రాన్స్ పై జరిగిన దాడి మార్కెట్ ట్రేడింగ్ సమయంలో జరిగివుంటే నష్టం మరింతగా ఉండేదని అంచనా వేశారు. వారాంతంలో ఘటన జరగడంతో, దాన్ని అరాయించుకునే సమయం ఇన్వెస్టర్లకు చిక్కినట్లయిందని వివరించారు. కాగా, ఎస్అండ్పీ 500 ఇండెక్స్ ఫ్యూచర్స్ ప్రస్తుతం శుక్రవారం నాటి ముగింపుతో పోలిస్తే ఒక శాతం నష్టంలో ఉంది. సోమవారం నాడు మిగతా దేశాలతో పోలిస్తే ఫ్రాన్స్, బ్రిటన్ ఈక్విటీలు ఎక్కువగా దిగజారతాయని అంచనా.