: ‘ఔటర్’ చుట్టూ వినోదాల విందు!... ప్రణాళిక సిద్ధం చేస్తున్న హెచ్ఎండీఏ
హైదరాబాదు మహా నగరం చుట్టూ ట్రాఫిక్ చిక్కులను తప్పించేందుకు ఉద్దేశించిన ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. మొత్తం 158 కిలో మీటర్ల పొడవున్న ఈ రోడ్డుపై ఎక్కడా చిన్న గతుకు కూడా కనిపించదు. శామీర్ పేట- ఘట్ కేసర్ మధ్య పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ పనులు వేగంగా సాగుతున్నాయి. జనవరి నాటికి పనులు పూర్తి కానున్నాయి. ఇక కండ్లకోయ వద్ద నిర్మించాల్సిన భారీ కూడలికి కూడా ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఈ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ రెండు పనులు పూర్తైతే, 158 కిలో మీటర్ల దూరంలో ఏ ఒక్క చోట కూడా క్షణం పాటు కూడా ఆగాల్సిన అవసరం ఉండదు. బ్రేకులు లేని ఈ రోడ్డుపై ఎక్కడా ఆగకూడదు. ఆగితే జరిమానా తప్పదు. ఆకలైనా, వాహనంలో పెట్రోల్ అయిపోయినా నగరంలోకి ప్రవేశించాల్సిందే. ఇదే విషయంపై సుదీర్ఘంగా పరిశీలన చేసిన హైదరాబాదు మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటి (హెచ్ఎండీఏ) భారీ ప్రణాళికకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ ప్రణాళిక కార్యరూపం దాలిస్తే, ఔటర్ రింగు రోడ్డు వినోదాల విందుకు కేంద్రంగా మారనుంది. రోడ్డుకు ఇరువైపులా ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేట్ వ్యక్తులకు చెందిన స్థలాలున్నాయి. ప్రైవేట్ భూములను పక్కనబెడితే, తొలుత ప్రభుత్వ భూములను డెవలపర్లకు లీజుకిచ్చి వినోద కేంద్రాలను ఏర్పాటు చేయించాలని హెచ్ఎండీఏ అధికారులు తలపోస్తున్నారు. ఈ వినోద కేంద్రాల్లో భాగంగా రెస్టారెంట్లు, పార్కులు, భారీ వాహనాల డ్రైవర్లు కాస్తంత కునుకు తీసేందుకు విశ్రాంతి మందిరాలు ఉన్నాయి. అంతేకాక పలు ప్రాంతాల్లో పెట్రోల్ పంపులను కూడా ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తద్వారా నగర ప్రజలకు ‘ఔటర్’ను వినోద కేంద్రంగా మార్చడమే కాక భారీగా ఆదాయం కూడా సమకూరే అవకాశాలున్నాయని అధికారుల అంచనా. మరి ఈ ప్రణాళిక ఎప్పుడు అమలవుతుందో చూడాలి.