: ‘ఎర్ర’ డాన్ గంగిరెడ్డి మా సీఎంనే చంపబోయాడు!... మారిషస్ పోలీసులతో ఏపీ డీజీపీ
ఎర్రచందనం అక్రమ రవాణాలో అంతర్జాతీయ స్మగ్లర్ గా ఎదిగిన కొల్లం గంగిరెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు ఏపీ పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు. ప్రస్తుతం అతడిని ఏపీ పోలీసులకు అప్పగించేందుకు మారిషస్ పోలీసులు ఎట్టకేలకు అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. మారిషస్ నుంచి సానుకూల సంకేతాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో తిరుపతి అర్బన్ ఎస్పీతో కలిసి ఏపీ సీఐడీ చీఫ్ ద్వారకా తిరుమలరావు రెండు రోజుల క్రితమే మారిషస్ వెళ్లారు. అయినా గంగిరెడ్డి అప్పగింతకు ఇంతకాలం ఆసక్తి చూపని మారిషస్ పోలీసులు ఉన్నట్టుండి మనసు మార్చుకోవడానికి గల కారణాలు వెల్లడయ్యాయి. నాలుగు రోజుల క్రితం ఏపీ డీజీపీ జేవీ రాముడు సీఐడీ అధికారులు, రాయలసీమ పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గంగిరెడ్డికి సంబంధించిన అంశం ప్రస్తావనకు రాగా, అక్కడికక్కడే రాముడు మారిషస్ పోలీసులకు ఫోన్ చేశారు. ‘‘చోటా రాజన్ పై భారత్ లో ఎన్ని కేసులున్నా ఒక్కదానిలోనూ శిక్ష పడలేదు. కానీ, మా మోస్ట్ వాంటెడ్ గంగిరెడ్డికి ఏపీలో ఓ కేసులో శిక్ష పడింది. చోటా రాజన్ కు ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు పూర్తి ఆధారాలు దొరకలేదు. అయినా పలువురు అమాయకులను చంపిన క్రిమినల్ కాబట్టి చోటా రాజన్ అరెస్ట్ కు బాలి పోలీసులు సహకరించారు. గంగిరెడ్డి ఏకంగా మా ముఖ్యమంత్రినే చంపబోయాడు. అది కూడా నిషేధిత మావోయిస్టులతో కలిసి. దీనికి సంబంధించి మీకు అన్ని ఆధారాలు ఇచ్చాం. పాస్ పోర్టు వివరాలు కూడా అందించాం. అయినా ఒక క్రిమినల్ ను మాకు అప్పగించకుంటే ఎలా?’’ అని జేవీ రాముడు ఆందోళన వ్యక్తం చేశారు. రాముడి వాదనతో ఏకీభవించిన మారిషస్ పోలీసులు ‘సహకరిస్తాం. రండి’ అంటూ సమాధానమిచ్చారట. వెనువెంటనే రంగంలోకి దిగిన ద్వారకాతిరుమలరావు మారిషస్ బయలుదేరి వెళ్లారు. నేడో, రేపో గంగిరెడ్డిని తీసుకుని ఆయన ఏపీకి రానున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.