: డెలివరీ బాయ్ వేధింపులతో ఊరొదిలి వెళ్లా... ఓ ఒంటరి యువతి వేదన!
బెంగళూరు నగరం... ఉద్యోగం నిమిత్తం ఒంటరిగా ఉంటున్న యువతి అంకిత (పేరు మార్చాం). వండుకునేందుకు ఓపిక లేని వేళ, మొబైల్ యాప్ ద్వారా తనకిష్టమైన ఆహారాన్ని ఓ రెస్టారెంటు నుంచి తెప్పించుకుంది. ఫుడ్ డెలివరీ చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి, తనకో గ్లాసు మంచినీళ్లు కావాలని అడిగాడు. అంకిత మానవత్వంతో తెచ్చిచ్చింది. అంతే... తానిచ్చిన గ్లాసుడు నీరు ఆమెకు పీడకలలను మిగులుస్తుందని ఆమెకు ఆ సమయంలో తెలియదు. ఆ తరువాత రెండు గంటలకు ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. ఆ డెలివరీ బాయ్ అంకితకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతూ, వేధించడం మొదలు పెట్టాడు. నంబర్ బ్లాక్ చేస్తే మరో నంబర్ నుంచి కాల్ చేసేవాడు. చివరికి తన నంబర్ మార్చుకున్నా వాడు వదిలిపెట్టలేదు. ఆ డెలివరీ బాయ్ వేధింపులకు ఊరొదిలి వెళ్లినా ఈ హెరాస్ మెంట్ ఆగలేదని, పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని వాపోతూ అంకిత ట్విట్టర్ లో పెట్టిన ఆమె పిటిషన్ కు ఎంతో స్పందన వచ్చింది. తాను గత సంవత్సరం అక్టోబర్ 10న కోరమంగళ ప్రాంతంలోని రెస్టారెంటు నుంచి ఫుడ్ తెప్పించుకున్నానని, ఆపై 10:30 గంటల సమయంలో బాయ్ వచ్చాడని, తాను ఓ చిన్న గదిలో ఒంటరిగా ఉంటున్నట్టు తెలుసుకుని వేధింపులు మొదలు పెట్టాడని తెలిపింది. ఈ బాయ్ వ్యవహారాన్ని రెస్టారెంటు యజమానికి తెలియజేస్తే, అతనితో క్షమాపణలు చెప్పించి, వేరే ఫ్రెండ్ నంబర్ అనుకుని కాల్ చేస్తున్నాడని సర్దిచెప్పారని, ఆ తరువాత కూడా మిస్డ్ కాల్స్, అసభ్యపు మాటలు తనకు ఎదురయ్యాయని వాపోయింది. తనకు ఫోన్ వచ్చినప్పుడల్లా ముగ్గురు, నలుగురు యువకులు కామెంట్లు చేస్తూ, నవ్వుకుంటున్నట్టు వినిపిస్తుండేదని తెలిపింది. ఎన్ని నంబర్లు బ్లాక్ చేసినా కొత్త నంబరును వాడేవారని వివరించింది. కాగా, అంకిత ట్విట్టర్ పోస్టు అనంతరం ఆమెకు సంఘీభావంగా వేలాది మంది నిలవడంతో, పోలీసులు ఆమెను వెతుక్కుంటూ వచ్చారు. బ్లాక్ చేసిన నంబర్లను తీసుకుని, ఆ బాయ్ భరతం పట్టేందుకు కదిలారు. చూద్దాం... ఈ కేసులో బెంగళూరు పోలీసులు ఏం చేస్తారో!