: ధరల పతనంతో బంగారానికి ఎనలేని డిమాండ్!


ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుతుండటంతో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో డిమాండ్ గణనీయంగా పెరగనుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) అంచనా వేస్తోంది. గత రెండేళ్లలో ఎన్నడూ లేనంతగా అమ్మకాలు అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో జరగనున్నాయని, ఆభరణాలతో పాటు నాణాలు, బిస్కెట్లకూ డిమాండ్ పెరుగుతోందని గురువారం నాడు డబ్ల్యూజీసీ మార్కెట్ ఇంటెలిజన్స్ మేనేజర్ అలిస్టర్ హ్యూవిట్ వ్యాఖ్యానించారు. గడచిన త్రైమాసికంలో 1,121 టన్నుల బంగారానికి డిమాండ్ వచ్చిందని, 201 రెండవ త్రైమాసికం తరువాత ఇదే అత్యధికమని ఆయన తెలిపారు. యూఎస్, చైనా దేశాల్లో బార్లు, నాణాల కొనుగోలు మరింతగా పెరిగిందని, స్పాట్ గోల్డ్ ధర జూలైలో 6 శాతం తగ్గిన తరువాత అమ్మకాలు ఊపందుకున్నాయని ఆయన అన్నారు. తగ్గుతున్న ధరలు ఎప్పటికప్పుడు ప్రజలకు కొత్త కొనుగోలు అవకాశాలను దగ్గర చేస్తున్నాయని అలిస్టర్ వ్యాఖ్యానించారు. ఇక భారత్ విషయానికి వస్తే, ఆభరణాల కొనుగోలులో వరల్డ్ నంబర్ 1గా నిలిచిన చోట గత త్రైమాసికంలో బంగారం విక్రయాలు 15 శాతం పెరిగాయని డబ్ల్యూజీసీ వెల్లడించింది. మొత్తం 211 టన్నుల మేరకు అమ్మకాలు సాగాయని, ఇదే సమయంలో చైనాలో 203 టన్నుల బంగారం అమ్మకం సాగిందని తెలిపింది. రష్యా, టర్కీ తదితర దేశాల్లో ఆభరణాలకు డిమాండ్ తగ్గిందని వివరించింది. గోల్డ్ ఈటీఎఫ్ లలోని బంగారం గత సంవత్సరం 24 టన్నులుగా ఉండగా, ఇప్పుడది 65.9 టన్నులకు పెరిగిందని వెల్లడించింది.

  • Loading...

More Telugu News