: రైతు వేషంలో పవన్ కల్యాణ్... పంచెకట్టుతో బెజవాడ పర్యటనపై అభిమానుల హర్షం
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతుల పక్షాన వకాల్తా పుచ్చుకున్న టాలీవుడ్ అగ్ర హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు రైతు వేషధారణలోనే బెజవాడ పర్యటనకు వెళ్లారు. నేటి ఉదయం హైదరాబాదులోని తన ఇంటి నుంచి పంచెకట్టులోనే బయలుదేరిన పవన్ కల్యాణ్ గన్నవరం విమానాశ్రయంలో తనకోసం వేచి చూస్తున్న అభిమానులను హుషారెత్తించారు. పంచెకట్టులో పవన్ కల్యాణ్ వస్తారని ఊహించని ఆయన అభిమానులు తన అభిమాన నటుడిని రైతు వేషంలో చూసి కేరింతలు కొట్టారు. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీ కోసం వెళ్లిన పవన్ కల్యాణ్ పంచెకట్టులో దర్శనమిచ్చి ఆసక్తికర చర్చకు తెర తీశారు. రైతుల పక్షాన సీఎంతో చర్చలకు వచ్చినందుననే పవన్ కల్యాణ్ పంచెకట్టులో వచ్చారని ఆయన అభిమానులు పేర్కొన్నారు.