: బెజవాడ బయల్దేరిన పవన్ కల్యాణ్... పయనానికి ముందు కామినేనితో భేటీ
జనసేన అధినేత, టాలీవుడ్ అగ్ర నటుడు పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితం హైదరాబాదు నుంచి విజయవాడ బయలుదేరారు. నేటి మధ్యాహ్నం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో పవన్ కల్యాణ్ భేటీ కానున్న సంగతి తెలిసిందే. నవ్యాంధ్ర రాజధాని, ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన పలు అంశాలకు సంబంధించి కీలక చర్చ జరగనున్నట్లు భావిస్తున్న ఈ భేటీపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. విజయవాడకు బయలుదేరే ముందు పవన్ కల్యాణ్ తో ఏపీ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ అరగంట పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. చంద్రబాబుతో భేటీ సందర్భంగా ప్రస్తావించాల్సిన అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీని ఖరారు చేయడంలో కీలకంగా వ్యవహరించిన కామినేని, భేటీలో చర్చించాల్సిన అంశాలపైనా దృష్టి సారించడంపై ఆసక్తి రేకెత్తుతోంది. విజయవాడకు చేరుకున్న తర్వాత చంద్రబాబుతో భేటీకి ముందు పనవ్ కల్యాణ్ అమరావతికి భూములిచ్చిన రైతులతో సమావేశం కానున్నారు.