: నితీశ్ ప్రమాణ స్వీకారోత్సవానికి మోదీకి ఆహ్వానం ...అద్వానీ, కేజ్రీలకు కూడా!


బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి నితీశ్ కుమార్ నేతృత్వంలోని మహా కూటమి ఝలక్కిచ్చింది. ఊహించని విధంగా ఎదురైన ఘోర పరాభవంతో ప్రధాని నరేంద్ర మోదీ డైలమాలో పడిపోయారు. విపక్షాల నుంచే కాక స్వపక్షం నుంచి కూడా వినిపిస్తున్న నిరసన గళాలతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నితీశ్ కుమార్ ఈ నెల 20న బీహార్ కు మూడో దఫా సీఎంగా పదవీ ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ హాజరవుతారా? అంటే... చెప్పలేం కాని నితీశ్ కుమార్ నుంచి మాత్రం ఆహ్వానం అందనుంది. బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఆహ్వానం పంపనున్నట్లు జేడీయూ బీహార్ చీఫ్ వశిష్ఠ నారాయణ్ సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్ డీ దేవేగౌడ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు హాజరుకానున్నట్లు సమాచారం. మహా కూటమి విజయానికి దోహదపడిన వారందరినీ నితీశ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించనున్నట్లు నారాయణ్ సింగ్ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News