: ఇక అఖిలేష్ యాదవ్ ఏం చేస్తారో... అందరి కళ్లూ ఆయన వైపే!
బీహార్ లో ఎన్నికలు ముగిశాయి. అధికారంలో ఉన్న నితీశ్ కుమార్ అద్భుత విజయాన్ని అందుకుని మరోసారి పగ్గాలు చేపట్టనున్నారు. ఇక 2017లో బీహార్ కు పొరుగు రాష్ట్రం యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్ పై అందరి కళ్లూ పడ్డాయి. ఆయన అధికారాన్ని నిలుపుకుంటాడా? లేదా? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రజల మదిలో నిలిచి పోవడానికి ఈ రెండేళ్లూ ఆయన ఎటువంటి ఎత్తులు వేస్తాడు? రాష్ట్రంలో మైనారిటీలపై పెరుగుతున్న హింసకు ఆయన ఎలా అడ్డుకట్ట వేస్తాడు? ఇటువంటి ప్రశ్నలెన్నో తలెత్తుతున్నాయి. వాస్తవానికి గడచిన మూడు దశాబ్దాల కాలంలో యూపీలో ఒకసారి అధికారంలో ఉన్న పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చిన సందర్భం లేదు. దీంతో యూపీ ప్రధాన విపక్షమైన బహుజన సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతి, తనకు తిరిగి అధికారం దక్కుతుందని భావిస్తున్నారు. ఇందుకోసం బీహార్ లో నితీశ్ అమలు చేసిన వ్యూహాన్ని ఆమె ఎంచుకోవచ్చని తెలుస్తోంది. చిన్న పార్టీలను కలుపుకుని కూటమిగా ఏర్పడాలన్నది ఆమె ఆలోచన. బీహార్ లో ఉన్న పరిస్థితులకు, యూపీ పరిస్థితికి చాలా తేడా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బీహారులో నితీశ్, లాలూ, కాంగ్రెస్ పార్టీలు కలసి ఎన్డీయేపై పోటీకి దిగాయి. అక్కడ ప్రధానంగా బరిలో ఉన్నది రెండు కూటములే. యూపీలో అటువంటి పరిస్థితి లేదు. పక్కలో బల్లెంలాంటి మాయావతికి, ఆపై బీజేపీకి సమాజ్ వాదీ పార్టీ వ్యతిరేకం. ఈ రెండు పార్టీలనూ ఎదుర్కొని విజయం సాధించాలంటే చాలా కష్టం. పైగా మాయావతి కాంగ్రెస్ తో పొత్తుకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టింది. పైగా బీహారులో కనిపించిన అభివృద్ధి నితీశ్ కు హ్యాట్రిక్ పీఠాన్ని అందించగా, యూపీలో అభివృద్ధి కంటికి కనిపించడం లేదన్న వాదనా ఉంది. ఈ నేపథ్యంలో వస్తున్న ఒత్తిడులను తట్టుకుని ఈ రెండేళ్లూ ఆయన ప్రజలకు ఎలా దగ్గరవుతాడన్నదానిపై తిరిగి అధికారంలోకి రావడం ఆధారపడి వుంటుందనడంలో సందేహం లేదు.