: సొంతిల్లున్నా, అద్దెకుంటున్నా... కొత్త పన్ను రాయితీలు ఇవే!
పట్టణ ప్రాంతాల్లో అద్దె గృహాలను ప్రోత్సహించడం ద్వారా, వలస వస్తున్న ప్రజలకు సౌకర్యాలను దగ్గర చేసేందుకు నరేంద్ర మోదీ సర్కారు సరికొత్త పన్ను రాయితీలను దగ్గర చేయనుంది. ఈ మేరకు ప్రత్యక్ష, పరోక్ష పన్ను లాభాలతో కూడిన వివరాలను కేంద్రం ప్రతిపాదించింది. ఇంటి యజమానులతో పాటు, అద్దెదారులకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానిక సంస్థలకూ లబ్ధి కలుగుతుందని కేంద్రం భావిస్తోంది. గృహాల అద్దెలను 'వాణిజ్య' కార్యకలాపాల విభాగం కిందకు తీసుకురావాలన్నది ఈ ముసాయిదా ప్రతిపాదనల్లోని ముఖ్యాంశం. దీని వల్ల హోటల్స్, పేయింగ్ గెస్ట్ అకామిడేషన్ తదితరాల నుంచి అధిక మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అద్దె చెల్లిస్తున్న ఉద్యోగి బేసిక్ వేతనం నుంచి 40 శాతం వరకూ హెచ్ఆర్ఏ (హౌస్ రెంట్ అలవెన్స్) పన్ను రాయితీలు పొందవచ్చు. "అందుబాటులోని గణాంకాల ప్రకారం, పట్టణ ప్రాంతాల్లోని పేదలు తమ ఆదాయంలో 30 శాతం ఇంటి అద్దెకు వెచ్చిస్తున్నారు. అధిక వేతనాలు పొందుతున్న వారితో పోలిస్తే పేదలు కడుతున్న అద్దెలే ఎక్కువ. ఈ పరిస్థితి మారాలి" అని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. "అవసరం ఆధారిత రెంటల్ హౌసింగ్" విధానాన్ని ఈ ముసాయిదాలో పరిచయం చేస్తున్నామని, వివిధ రంగాల్లో వ్యక్తుల అవసరాన్ని బట్టి నిబంధనలు మారుతాయని వెల్లడించారు. విద్యార్థులు, వర్కింగ్ మెన్/ఉమెన్, నిర్మాణరంగ కార్మికులు, వలసదారులు వంటి విభాగాలుంటాయని తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం, అందుబాటు అద్దెల్లో గృహాలు అందరికీ సాధ్యం కాదని భావిస్తున్నామని, మోదీ కలల ప్రాజెక్టుగా చేపట్టిన 'అఫర్డబుల్ హౌసింగ్' స్కీము విజయవంతం కావాలంటే, రెంటల్ విధానంలో మార్పు తప్పనిసరని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనలను చేసే ముందు గృహ రుణాల్లో సబ్సిడీ, వడ్డీ రాయితీలు వంటి ఆలోచనలు చేశామని, నిశ్చిత ఆదాయం లేని వర్గాలకు ఈ విధానం అంతగా ఉపయోగపడదని భావిస్తున్నామని, అందువల్లే ఈ గ్రూప్ కోసం విడిగా ఓ మోడల్ ను తీసుకురానున్నామని పేర్కొన్నారు. అద్దెలు కట్టుకోలేని పేదలకు రెంటల్ ఓచర్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తాయని, వీటిని యాజమాన్యం పన్ను రాయితీలుగా వాడుకోవచ్చని, ఆస్తి పన్ను చెల్లింపుల్లోనూ వినియోగించుకోవచ్చని తెలిపారు. కాగా, 2011 జనాభా లెక్కల ప్రకారం, ఇండియాలో 1.10 కోట్ల గృహాలు అద్దెదారులు లేక ఖాళీగా ఉన్నాయి. వీటి అద్దెలు అధికంగా ఉండటమే ఇందుకు కారణం. వీటిని రెంటల్ హౌసింగ్ విధానంలోకి తీసుకువచ్చి పేదలకు తక్కువ ధరలకు అద్దె ఇళ్లు లభించేలా చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు అంటున్నారు.