: లాలూ మార్క్ కిరికిరి మొదలు... ఎన్నికల్లో పోటీ చేయని కుమార్తెకు ఉప ముఖ్యమంత్రి పదవికి ఒత్తిడి!
బీహారులో ఎన్నికల ఫలితాలు వెల్లడై 48 గంటలు కూడా కాకముందే ఆర్జేడీ అధినేత నుంచి సీఎం నితీశ్ కుమార్ పై ఒత్తిడి మొదలైనట్టు తెలుస్తోంది. తన కుమార్తె మీసా భారతికి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఇద్దరు కుమారుల్లో ఒకరికి కీలకమైన మంత్రి పదవి తప్పనిసరిగా ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. వాస్తవానికి అసెంబ్లీలో లాలూ పార్టీ బలమే ఎక్కువ. కానీ, సీఎంగా మాత్రం నితీశ్ కొనసాగుతారని లాలూ ముందు నుంచే చెబుతున్నారు. ఇక ఈ ఎన్నికల్లో లాలూ కుమారులు ప్రతాప్, తేజస్వీలు ఇద్దరూ విజయం సాధించారు. వీరిలో ఎవరికి మంత్రి పదవిని సిఫార్సు చేయాలన్నది మాత్రం లాలూకు కత్తిమీద సాము వంటిదేనని తెలుస్తోంది. ఎమ్మెల్సీగా ఉండి, ఎమ్మెల్యే బరిలో దిగి విజయం సాధించిన లాలూ పీఏ భోలా యాదవ్ ఎమ్మెల్సీ స్థానాన్ని మీసాకు ఇచ్చి, ఆమెను డిప్యూటీ సీఎంగా చూసుకోవాలని లాలూ భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే నితీశ్ కు తన మనసులోని మాటను ఆయన చెప్పేసినట్టు తెలిసింది. మొత్తం 36 మందికి మంత్రి పదవులు లభించే అవకాశం ఉండగా, తొలి దశలో 25 నుంచి 27 మందికి పదవులు లభించే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ సైతం అధికారంలో భాగం పంచుకోవాలని భావిస్తోంది. వారికో మూడు మంత్రి పదవులు దక్కే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.