: తమిళనాడు, పుదుచ్ఛేరిలను కుదిపేసిన రోవాను... ఏపీలోని మూడు జిల్లాలను కూడా!
బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తుపానుగా మారింది. తమిళనాడు, పుదుచ్ఛేరిలతో పాటు ఏపీలోని మూడు జిల్లాలను ఈ తుపాను అతలాకుతలం చేసింది. పుదుచ్ఛేరి వద్ద తీరం దాటిన ఈ తుఫానుకు వాతావరణ శాఖ ‘రోవాను తుపాను’గా నామకరణం చేసింది. రోవాను కారణంగా తమిళనాడు, పుదుచ్ఛేరిల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో తమిళనాట మెజారిటీ ప్రాంతాలు నీట మునిగాయి. వర్షంతో జనజీవనం పూర్తి స్థాయిలో స్తంభించింది. పలు ప్రాంతాల్లో భారీ చెట్లు విరిగిపడ్డాయి. పుదుచ్ఛేరిలో పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక ఏపీలోని నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలను రోవాను అతలాకుతలం చేసింది. చిత్తూరు జిల్లాలోని వెంకన్న సన్నిధి తిరుమలలో ఎడతెరిపి లేని వర్షం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షం కారణంగా తిరుమల ఘాట్ రోడ్లలో పలు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్న టీటీడీ అధికారులు కొండ చరియలను తొలగిస్తూ వాహనాల రాకపోకలను పునరుద్ధరిస్తున్నారు. నేటి సాయంత్రానికి గాని రోవాను ప్రభావం చల్లబడేలా లేదు.