: రియాద్ లో నిజామాబాద్ వాసి హత్య... 16 నెలల తర్వాత వెలుగుచూసిన వాస్తవం


జీవనోపాధి నిమిత్తం తెలంగాణాలోని నిజామాబాద్ నుంచి సౌదీ అరేబియాకు వెళ్లిన ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ హత్య విషయం అతని కుటుంబసభ్యులకు పదహారు నెలల తర్వాత ఆలస్యంగా తెలిసింది. అదికూడా, ఒక వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధి ద్వారా ఈ సమాచారం అందింది. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలు.. నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన సైద్ సయ్యద్ గత ఏడాది జూన్ లో సౌదీ రాజధాని రియాద్ లోని మున్సిపాల్టీలో క్లీనింగ్ విభాగంలో పనిచేసేందుకుగాను అక్కడికి వెళ్లాడు. ఉద్యోగ నిబంధనల ప్రకారం, యాజమాన్యం వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అతనిని ఆసుపత్రికి పంపించింది. అలా వెళ్లిన వ్యక్తి ఇక తిరిగి రాలేదు. దీంతో అతను కనిపించడం లేదంటూ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకు సయ్యద్ మృతదేహం రాజధాని శివార్లలో దొరికింది. వైద్య పరీక్షల నిమిత్తం సయ్యద్ తో పాటు వెళ్లిన మనదేశానికి చెందిన కార్మికుడు, ఒక నేపాల్ జాతీయుడు కలిసి ఈ హత్య చేసినట్లు నిర్ధారించిన పోలీసులు వారికి జైలు శిక్ష విధించారు. అయితే, ఈ వ్యవహారమంతా భారత్ లో ఉన్న సయ్యద్ భార్యకు, కుటుంబసభ్యులకు తెలియదు. సౌదీకి వెళ్లిన తన భర్త నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో సయ్యద్ భార్య జరీనాబేగం ఆరా తీసేందుకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ఏజెంట్లను, పోలీసులను సంప్రదించింది. అయినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. చివరగా, నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్ కేంద్రంగా పనిచేస్తున్న గల్ఫ్ రిటర్నింగ్ మెంబర్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధి చాంద్ బాషాను ఆమె కలిసింది. భారత విదేశాంగ శాఖ అధికారులను ఆయన సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది. సయ్యద్ మృతదేహం గుర్తుపట్టడానికి వీలులేనంతగా వుండి, కుళ్లిపోవడంతో ఆ దేశంలోనే అంత్యక్రియలు చేసినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని సయ్యద్ భార్య జరీనాబేగంకు, కుటుంబసభ్యులకు చాంద్ బాషా చెప్పడంతో వారు రోదించారు. కాగా, రియాద్ లో సయ్యద్ పని చేసేందుకు వెళ్లిన సంస్థ యాజమాన్యం, సౌదీ విదేశాంగ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దారుణం తమకు తెలియలేదని సయ్యద్ కుటుంబసభ్యులు మండిపడుతున్నారు.

  • Loading...

More Telugu News