: నితీశ్ ఇల్లు, ఆర్జేడీ ఆఫీస్ వద్ద సంబరాల జోరు... నిరాశలో బీజేపీ శ్రేణులు
బీహార్ ఎన్నికల్లో భాగంగా నేటి ఉదయం మొదలైన ఓట్ల లెక్కింపు కేవలం గంటల వ్యవధిలోనే పరిస్థితిని తారుమారు చేసింది. కౌంటింగ్ ప్రారంభం కాగానే బీజేపీ ఆధిక్యం కనబరచిన స్థానాల సంఖ్య భారీగా కనిపించడంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. పాట్నాలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు బాణా సంచా పేల్చడంతో పాటు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. అయితే రెండు గంటలు గడిచాయో లేదో సంబరాల ప్లేస్ మారిపోయింది. అప్పటిదాకా బీజేపీ కార్యాలయం వద్ద మిన్నంటిన సంబరాలు చప్పబడిపోయాయి. ఒక్కసారిగా మహా కూటమి ఆధిక్యం కనబరచిన స్థానాల సంఖ్య అనూహ్యంగా పెరగడమే కాక నితీశ్ జట్టుదే విజయమని ఖాయమైన నేపథ్యంలో కూటమిలోని పార్టీల కార్యకర్తలు సంబరాలు ప్రారంభించారు. జేడీయూ కార్యకర్తలు నితీశ్ కుమార్ ఇంటి వద్దకెళ్లి సంబరాలు ప్రారంభించగా, ఆర్జేడీ కార్యకర్తలు తమ పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున బాణా సంచా పేల్చారు. మరోవైపు జేడీయూకు సరిసమానంగా స్థానాల్లో ఆర్జేడీ అభ్యర్థులు ఆధిక్యం సాధించడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఉప్పొంగిపోతున్నారు.