: మినిస్టర్ క్వార్టర్స్ లో పాముల మంద... భయాందోళనల్లో మంత్రివర్యులు
హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్ నెం:12లో మంత్రుల కోసం అధునాతన సౌకర్యాలతో భవంతులు నిర్మితమయ్యాయి. అప్పటిదాకా అక్కడ ఉన్న కొండలు, గుట్టలను తొలగించిన అధికార యంత్రాంగం అక్కడ మినిస్టర్ క్వార్టర్స్ ను నిర్మించింది. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ భవంతుల నిర్మాణం పూర్తైంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కేబినెట్ మంత్రులు ఈ క్వార్టర్స్ లో కొలువుదీరారు. ఇదంతా బాగానే ఉన్నా, నిన్న మినిస్టర్ క్వార్టర్స్ వద్ద కలకలం రేగింది. నిత్యం రద్దీగా ఉండే ఆ భవంతుల వద్ద పాముల మంద కనిపించింది. ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా ఆరు పాములు అక్కడ దర్శనమిచ్చాయి. వీటిని చూసిన సందర్శకులు, మినిస్టర్ క్వార్టర్స్ లో పనిచేసే సిబ్బంది విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రుల నుంచి సమాచారం అందుకున్న జూ సిబ్బంది హుటాహుటిన అక్కడకు వచ్చి పాములను పట్టేశారు. ఇటీవల చాలా సందర్భాల్లో అక్కడ పాములు కనిపిస్తున్నాయట. దీంతో మంత్రులు, వారి కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురవుతున్నారు.