: ఎమ్మెల్యే చింతమనేని అంతే మరి!... ఈ దఫా అటవీ శాఖ సిబ్బందిపై దాడి
గతంలో తహశీల్దారు వనజాక్షిపై దాడి చేసిన ఘటనలో ఇరుక్కుని, ఆపై ప్రభుత్వ పెద్దల జోక్యంతో బయటపడిన దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ చింతమనేని ప్రభాకర్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అటవీ శాఖకు చెందిన భూమిలో తన అవసరాల కోసం రాత్రికి రాత్రి అనుచరులతో రోడ్డు వేయించారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి కొల్లేరు సరస్సులోనే రహదారిని వేయించారు. కోమటిలంక నుంచి అటపాక వరకూ చింతమనేని అనుచరులు రహదారి నిర్మిస్తున్నారని తెలుసుకున్న అటవీ అధికారులు అర్ధరాత్రి ఆ ప్రాంతానికి వెళ్లి అడ్డుకోబోగా, వారు బెదిరింపులకు దిగి దాడి చేశారు. తమను చింతమనేని కూడా బెదిరించారని, దౌర్జన్యం చేశారని, వారి అనుచురులు కొట్టారని అటవీశాఖ సిబ్బంది కైకలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకా కేసు నమోదు కాలేదని తెలుస్తోంది. కాగా, చింతమనేని ప్రభాకర్ స్వయంగా రాత్రిపూట తన అనుచరులతో కొల్లేరు సరస్సు మధ్య రోడ్డు వేయడం కొత్త వివాదానికి తెరలేపింది.