: విమానప్రమాద సమయంలో కూతుర్ని గుండెల్లో దాచుకున్న తండ్రి!
తన ప్రాణాలు పోయినప్పటికీ తన కూతురికి ఎటువంటి ప్రమాదం వాటిల్లకూడదనే ఉద్దేశ్యంతో తన గుండెలకు హత్తుకుని మరీ ఆ చిన్నారిని తండ్రి రక్షించాడు. ఈ సంఘటన ఇటీవల దక్షిణ సూడాన్ లో కూలిపోయిన కార్గో విమాన ప్రమాద సంఘటనలో జరిగింది. విశేషం ఏమిటంటే, ఊహించని విధంగా తండ్రీకూతుళ్లిద్దరూ ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, ఆ చిన్నారి తల్లి, చెల్లి మాత్రం ప్రాణాలు కోల్పోయారు. ఈ 13 నెలల చిన్నారి నిలౌ అపస్మారక స్థితిలో తన తండ్రి ఛాతీపై గాయాలతో పడి ఉండటాన్ని స్థానిక టీవీ ప్రతినిధి ఆచల్ డెంగ్ గుర్తించింది. ఈ సంఘటనలో నిలౌ కాలు విరగడమే కాకుండా, నుదుటిపై గాయాలయ్యాయి. వెంటనే ఈ సమాచారాన్ని రక్షణ దళాలకు చేరవేయడంతో వారు నిలౌను రక్షించారు. నిలౌ తండ్రి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. తల, కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. చిన్నారి తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఈ వివరాలు తెలిపినట్లు సమాచారం. కాగా, ఈ ఘోర సంఘటనలో చిన్నారి ప్రాణాలతో బయటపడటం నిజంగా దైవ లీలే అని ఆచల్ డెంగ్, రక్షణ దళాల అధికారులు అన్నారు. కాగా, ఈ విమాన ప్రమాద సంఘటనలో 37 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. పరిమితికి మించిన సరుకులతో ఈ విమానం ప్రయాణం చేయడం కారణంగానే ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు ఆ దేశ రవాణా మంత్రి పేర్కొన్నారు.