: భగభగ మంటల్లో అరగంట పాటు... సారిక, ముగ్గురు బిడ్డల నరకయాతన!


బతికుండగానే 100 డిగ్రీల సెల్సీయస్ కన్నా అధిక వేడి శరీరానికి తాకుతుంటే... అసలు ఆ ఆలోచన మదిలోకి వస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, మనవళ్లు అభినవ్, అయాన్, శ్రీయాన్‌ లు ప్రాణాలతో ఉన్నప్పుడే మంటలు అంటుకున్నాయి. ఆపై కొన్ని నిమిషాల వ్యవధిలోనే వారి ప్రాణాలు పోయినప్పటికీ, సుమారు అరగంట పాటు వారి శరీరాలు కాలుతూనే ఉన్నాయి. వీరి పోస్టుమార్టం వివరాలను అధికారికంగా ప్రకటించనప్పటికీ, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఘటన తెల్లవారుఝామున 3 గంటల సమయంలో జరిగిందని తెలుస్తోంది. కేవలం గ్యాస్ మాత్రమే లీకైందా? లేదా మరేదైనా మండే ఇంధనాన్ని వాడారా? అన్న విషయాన్ని తేల్చేందుకు వారి దుస్తుల నమూనాలు సేకరించారు. వారు మరణించే ముందు తిన్న ఆహారంలో విషం పెట్టారా? అన్న విషయమై నిర్ధారణకు వారి కడుపులోని ఆహార పదార్థాల నమూనాలను డాక్టర్లు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. గదిలో గ్యాస్ లీకైందని వైద్యులు ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. గ్యాస్ మంటలకు అతి దగ్గరగా వీరంతా ఉన్నారని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కనీసం కొన్ని నిమిషాల పాటు వీరు నరకయాతన అనుభవించి వుంటారని, మృతదేహాల ఊపిరితిత్తుల్లో పొగ ఆనవాళ్లు ఉన్నాయని తెలిపాయి. ఈ కేసులో మరింత స్పష్టత రావాల్సి వుందని వైద్య వర్గాలు అంటున్నాయి.

  • Loading...

More Telugu News