: ‘బాలీవుడ్’లో అమితాబ్ అడుగుపెట్టి 46 ఏళ్లు!
బిగ్ బీ, బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి నేటికి 46 సంవత్సరాలు పూర్తయింది. 1969లో 'సాత్ హిందూస్థానీ' చిత్రంతో తన సినీ జీవితాన్ని ఆయన ప్రారంభించారు. ఖవాజా అహ్మద్ అబ్బాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో పోయట్ పాత్రను బిగ్ బీ పోషించారు. ఆ తర్వాత ఆనంద్, బావార్చి, బాంబే టూ గోవా వంటి చిత్రాలలో హీరో పాత్రలు వేశారు. జంజీర్, దీవార్, షోలే వంటి యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలలో నటించి స్టార్ డమ్ సంపాదించుకున్నారు. సినిమాల్లో యాంగ్రీ యంగ్ మెన్ గా పేరు సంపాదించుకున్న అమితాబ్ బచ్చన్ నటించిన ప్రేమకథా చిత్రాలు చాలా ప్రజాదరణ పొందాయి. కభీకభీ, అభిమాన్, చుప్ కే చుప్ కే వంటి ప్రేమ కథా చిత్రాల్లో ఆయన నటనకు ప్రేక్షకులు మైమరచిపోయారు. నలభై ఆరేళ్లుగా తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న 73 సంవత్సరాల అమితాబ్ బచ్చన్ తాజా చిత్రం 'వజీర్' కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.