: సమంత ఆదర్శం... అవయవ దానం ప్రకటనకు సిద్ధమవుతున్న స్టార్ హీరోయిన్
టాలీవుడ్ లోనే కాక కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న ప్రముఖ నటి సమంత అందరికీ ఆదర్శంగా నిలవనుంది. ఇప్పటికే ప్రత్యూష ఫౌండేషన్ ఏర్పాటు చేసిన సమంత పేదరికం కారణంగా ఆపరేషన్లు చేయించుకోలేకపోతున్న చిన్నారులకు ఆర్థిక సాయం చేస్తోంది. తాజాగా అవయవ దానంపై ముమ్మరంగా ప్రచారం చేసేందుకు ఆమె సన్నాహాలు చేస్తోంది. ప్రచారానికే పరిమితం కాకుండా తాను కూడా అవయవ దానం చేస్తున్నట్లు ఆమె ప్రకటించనుంది. ఈ నెల 7న ప్రత్యూష ఫౌండేషన్, హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఆధ్వర్యంలో జరగనున్న కార్యక్రమంలో భాగంగా సమంత తన అవయవాలను దానం చేయనున్నట్లు ప్రకటన చేయనుంది. అంతేకాక అవయవదానంపై తన అభిమానులను కూడా ఆమె ప్రోత్సహించనుంది. ఇందుకోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపట్టాలని ఆమె భావిస్తోందట.