: హిమాచల్ సీఎం అక్రమాస్తుల కేసు ఢిల్లీ హైకోర్టుకు ట్రాన్స్ ఫర్


హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ అక్రమాస్తుల కేసు విచారణ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరభద్ర సింగ్ ను అరెస్ట్ చేయకుండా హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు అడ్డుకుంటోందని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంతేకాక ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో వీరభద్ర సింగ్ పిటిషన్ ను విచారిస్తున్న న్యాయమూర్తి గతంలో వీరభద్ర సింగ్ కేసులను న్యాయవాదిగా వాదించారని సీబీఐ తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సుప్రీం ధర్మాసనానికి విన్నవించారు. అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా కేసును ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయమని ఎలా కోరతారని వీరభద్ర సింగ్ తరఫున వకాల్తా పుచ్చుకున్న ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ఇరు పక్షాల వాదనలను విన్న సుప్రీం ధర్మాసనం కేసును ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News