: ‘టీ హబ్’ కు నేడే శ్రీకారం... రతన్ టాటా చేతుల మీదుగా ప్రారంభం
యువతలోని టాలెంట్ ను వెలికితీయడమే కాక, సదరు టాలెంట్ కు కార్యరూపం ఇచ్చేందుకు ఉద్దేశించిన ‘టీ హబ్’ నేడు హైదరాబాదులో ప్రారంభం కానుంది. ‘ఆలోచనలతో రండి... ఆవిష్కరణలతో వెళ్లండి’ అన్న నినాదంతో ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మది నుంచి పుట్టిన ఆలోచనకు ‘టీ హబ్’ ప్రతిరూపం. హైదరాబాదులోని ట్రిపుల్ ఐటీ కేంపస్ లో దాదాపు 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భారీ భవంతి ‘టీ హబ్’కు వేదిక కానుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా నేటి సాయంత్రం టీ హబ్ ను ప్రారంభించనున్నారు. విద్యాభ్యాసం పూర్తయిన విద్యార్థులు ఎవరో ఒకరి వద్ద పనిచేయాల్సిందేనా? అంటూ మధనపడాల్సిన అవసరం ఇకపై ఉండబోదని, అలాంటి యువతకు ‘టీ హబ్’ చక్కటి పరిష్కారం చెబుతుందని కేటీఆర్ చెబుతున్నారు. పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే ‘టీ హబ్’ ఏర్పాటైనా నిర్వహణలో మాత్రం ప్రభుత్వ జోక్యం అంతగా ఉండదని ఆయన చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘స్టార్టప్ ఇండియా... స్టాండప్ ఇండియా’ నినాదానికి ‘టీ హబ్’ వత్తాసు పలుకుందని కూడా కేటీఆర్ పేర్కొన్నారు.