: క్లాస్ రూంలో అమ్మాయిలతో కలిసి కూర్చున్నాడని సస్పెండ్


స్నేహం పేరిట యువతీ యువకులు కలిసి తిరుగుతున్నా సర్వసాధారణమని పట్టించుకోని ఈ రోజుల్లో తరగతి గదిలో అమ్మాయిలతో కలిసి కూర్చున్నాడని ఓ విద్యార్థిని సస్పెండ్ చేసిన ఘటన కేరళలో వెలుగు చూసింది. కోజికోడ్ లోని ఫరూఖ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న కొందరు విద్యార్థులు తమ తరగతి గదిలో విద్యార్థినుల పక్కన కూర్చున్నారు. దీంతో కళాశాల నిబంధనలు అతిక్రమించారని సూచిస్తూ ఆ విద్యార్థులను కళాశాల యాజమాన్యం వివరణ కోరింది. విద్యార్థులంతా క్షమాపణ పత్రం రాసి, ఇంకోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడతామని కళాశాల యాజమాన్యానికి ఇచ్చారు. అయితే ఒక విద్యార్థి మాత్రం ఇందుకు అంగీకరించలేదు. దీంతో ఆ విద్యార్థిని కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. రాతపూర్వకంగా క్షమాపణ చెప్పకపోవడంతో తనను సస్పెండ్ చేశారని ఆ విద్యార్థి తెలిపాడు. తమ కళాశాలలో విద్యార్థులు, విద్యార్థినులకు వేర్వేరుగా బెంచీలు ఉన్నాయని, క్యాంటీన్ లో కూడా వేర్వేరు బెంచీలు ఉన్నాయని, కాలేజీ యాజమాన్యం లింగ వివక్షను పాటిస్తోందని సస్పెండైన విద్యార్థి ఆరోపించాడు. అయితే, దీనిపై కాలేజీకి చెందిన ఓ మహిళా ప్రొఫెసర్ వివరణ ఇచ్చారు. క్లాస్ రూమ్, క్యాంటీన్లలో అబ్బాయిలు, అమ్మాయిలకు వేర్వేరు బెంచీలు ఉంటాయని... బెంచీలపై వీరు కలసి కూర్చోవడం కుదరదని తేల్చి చెప్పారు. ఆడిటోరియంలో కుర్చీలు ఉంటాయి కనుక అబ్బాయిలు, అమ్మాయులు పక్కపక్క సీట్లలో కూర్చున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఇతర విద్యాసంస్థల్లో కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారని చెప్పారు. కాలేజ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికే సదరు విద్యార్థి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు.

  • Loading...

More Telugu News