: ఇకపై భారత్ లో కచేరీలు నిర్వహించను: గులాం అలీ
భారత్ లో ఇకపై ఎలాంటి సంగీత కచేరీలను నిర్వహించనని పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ గజల్ గాయకుడు గులాం అలీ స్పష్టం చేశారు. అంతేకాకుండా, భారత్ లో నిర్వహించే కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. భారత రాజకీయాలు తనను ఎంతో బాధించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు తన కచేరీలు భారత్ లో ఉండవని చెప్పారు. తన కచేరీలను అడ్డుకోవడం ద్వారా భారత్ లోని కొన్ని రాజకీయ పార్టీలు లబ్ధి పొందాలని భావిస్తున్నాయని ఆరోపించారు. దీనిపై సెన్సార్ బోర్డు సభ్యుడు అశోక్ పండిట్ స్పందిస్తూ, గులాం అలీ మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మరోవైపు, సరిహద్దుల్లో ఉన్న భారత సైనికులతో పాకిస్థాన్ సరిగా వ్యవహరించేంత వరకు కూడా గులాం అలీ ఇండియాలో అడుగుపెట్టవద్దని సలహా కూడా ఇచ్చారు.