: చంద్రబాబు మది... గోల్కొండ కోటలా కొండపల్లి!


హైదరాబాదు నడిబొడ్డున నిలిచి శతాబ్దాల చరిత్ర గల గోల్కోండ కోట తరహాలో, విజయవాడ సమీపంలోని కొండపల్లి కోటను అభివృద్ధి చేయాలని చంద్రబాబు సర్కారు సంకల్పించింది. ఈ దిశగా కొండపల్లి కోట పూర్వవైభవాన్ని ప్రజలకు తెలిపి, పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రణాళికలు రూపొందించాలని టూరిజం విభాగానికి ఆదేశాలు అందాయని తెలుస్తోంది. కొండపల్లి కోట కాకతీయులకు సంబంధించినది కాగా, పాలకుల ఆదరణకు నోచుకోక మరుగున పడింది. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత, రాజధానికి అమరావతి సమీపంలోనే ఈ కోట ఉండటంతో ఈ కోట చరిత్రను అందరికీ పరిచయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించుకున్నారు. పీపీపీ విధానంలో (పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం)తో ఈ కోటను అభివృద్ధి చేయాలన్నది తమ ఉద్దేశమని, ఇక్కడ సౌండ్ అండ్ లైట్ షోను కూడా ఏర్పాటు చేస్తామని ఏపీటీడీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మొత్తం ప్రాజెక్టుకు రూ. 10 కోట్లను ఇందుకోసం కేటాయించనున్నామని, కోటకు సంబంధించిన విలువైన ఆధారాలు, శిల్పాలు ప్రస్తుతం హైదరాబాదులోని స్టేట్ మ్యూజియంలో ఉండగా, వాటిని ఇక్కడికే తీసుకురావాలని భావిస్తున్నట్టు వివరించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా కొండపల్లి గ్రామం నుంచి కోట వరకూ రోప్ వే, ఫుడ్ కోర్టులు, టూరిస్టుల అవసరార్థం టాయిలెట్లను నిర్మించనున్నామని తెలిపారు. కాగా, ఇప్పటికే కేంద్రం ప్రకటించిన మెగా టూరిజం సర్క్యూట్ లో కొండపల్లికి స్థానం లభించిన సంగతి తెలిసిందే. కొండపల్లి - ఇబ్రహీంపట్నం - భవానీ ద్వీపం - మచిలీపట్నం - దివిసీమ ప్రాంతాలను భాగం చేస్తూ, టూరిజం సర్క్యూట్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, ఇందుకు రూ. 49.99 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇచ్చేంత వరకూ ఆగకుండా, రాష్ట్ర ప్రభుత్వం తరపునే చేపట్టాలన్నది చంద్రబాబు అభిమతమని, టూరిజం అధికారి ఒకరు వివరించారు.

  • Loading...

More Telugu News