: చిన్నారి శరీరం వెలుపల గుండె... చికిత్స కోసం చేతబట్టుకుని అమెరికాకు!
తోటి పిల్లలతో ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులో బతకటం కోసం పోరాటం చేస్తోంది ఓ చిన్నారి. పది లక్షల మందిలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధితో ఆ చిన్నారి బాధపడుతోంది. శరీరం లోపల ఎడమ వైపున ఉండాల్సిన గుండె ఆ చిన్నారికి శరీరం వెలుపల ఛాతీ మధ్యలో ఉంది. ఆ గుండె చుట్టూ పలుచటి చర్మం పొర మాత్రమే ఉంది. గుండె స్పందనలు కూడా బయటకు కనపడతాయి. ఈ వ్యాధి పేరు 'థొరాకో అబ్డోమినల్ సిండ్రోమ్'. ఈ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పేరు విర్సావియా. రష్యాకు చెందినది. శస్త్ర చికిత్స ద్వారా ఆ చిన్నారి గుండెను సరిచేయాలనుకున్న పలువురు డాక్టర్లు... చాలా క్లిష్టమైన ప్రక్రియ అంటూ చేతులెత్తేశారు. అయితే ఆమె తల్లి డారీ బోరెన్ మాత్రం తన చిన్నారికి ఎలాగైనా అందరిలాంటి జీవితం ఇవ్వాలని పట్టు వదలకుండా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే బోస్టన్ లోని ఓ ఆసుపత్రి వైద్యులు ఆమెకు ఆపరేషన్ నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. అయితే, చిన్నారికి బీపీ ఎక్కువగా ఉండటంతో వారు వెనకడుగు వేశారు. ఈ నేపథ్యంలో, విర్సావియాకు రక్తపోటు తగ్గించేందుకు లాస్ ఏంజెలెస్ కు వారు పయనమవుతున్నారు. ఆ చిన్నారి ఆపరేషన్ సక్సెస్ అయి, అందరిలాగా ఆడుతూ పాడుతూ గడపాలని మనమూ కోరుకుందాం.