: తొలి రోజే 'బేర్'మన్న కాఫీ డే!
కాఫీ డే ఎంటర్ ప్రైజస్... ఇటీవల నిధుల సమీకరణ నిమిత్తం మార్కెట్ కు వచ్చి విజయవంతమైంది. సంస్థ ఐపీఓను ప్రకటించి, రూ. 1,150 కోట్లు కావాలని కోరగా, అంతకుమించిన బిడ్లు దాఖలయ్యాయి. వాటాల విక్రయం అనంతరం, నేటి ఉదయం కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయింది. ఆ వెంటనే 'బేర్' మంటూ, 14.5 శాతం దిగజారింది. రూ. 328 ధరపై వాటాలను కొనుగోలు చేసిన ఎంతో మంది ఇన్వెస్టర్లు తమకు ఆ వాటాలు అక్కర్లేదన్న నిర్ణయానికి వచ్చి నష్టానికైనా అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో సెషన్ ఆరంభంలోనే కాఫీ డే ఈక్విటీ విలువ రూ. 290కి పడిపోయింది. అయితే, ఈ తరహాలో కాఫీని విక్రయిస్తూ, రిటైల్ చైన్ నిర్వహిస్తున్న కంపెనీల్లో ఇప్పటివరకూ స్టాక్ మార్కెట్లో లిస్టవుతున్నవి ఏవీ లేకపోవడంతో, సంస్థ వాల్యూపై సందిగ్ధత నెలకొందని, వాస్తవానికి ఈ సంస్థకు ఇంకా మంచి విలువ రావాల్సివుందని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో సంస్థ రూ. 4,500 కోట్ల రుణాలు చెల్లించాల్సి వుందని, అది సంస్థ వృద్ధికి అడ్డుగా నిలవవచ్చన్న భావననూ వ్యక్తం చేస్తున్నారు.