: భజ్జీ పెళ్లిపై పోలీసు కంప్లైంట్... ధూమపానంపై సిక్కు సంఘాల ఫిర్యాదు
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పెళ్లిలో మరో వివాదం చోటుచేసుకుంది. ఇప్పటికే వివాహ వేడుకను కవర్ చేసేందుకు వచ్చిన మీడియాపై భజ్జీ బౌన్సర్లు దాడి చేయడం, భజ్జీ క్షమాపణలు చెప్పడం తెలిసిందే. అంతేకాక, గురుద్వారాలోకి వెళ్లకుండా భజ్జీ అడ్డుకున్నాడని అతడిపై అకాళీదళ్ సీనియర్ నేత ఒకరు అకల్ తఖ్త్ కు ఫిర్యాదు చేశారు. తాజాగా సిక్కు సంఘాలు భజ్జీ పెళ్లిపై ఏకంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాయి. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలో భజ్జీ కుటుంబం అతిథులకు 113 రకాల పొగాకు ఉత్పత్తులను సరఫరా చేసిందట. దీనిపై పక్కా సమాచారం అందుకున్న సిక్కు సంఘాల పెద్దలు భజ్జీపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సిక్కు మత విశ్వాసాల ప్రకారం పొగాకు వినియోగం (ధూమపానం), మద్యపానం నిషేధం. అయితే పొగాకు ఉత్పత్తులను అతిథులకు సరఫరా చేయడం ద్వారా భజ్జీ ఈ నిబంధనను అతిక్రమించాడనేది సిక్కు సంఘాల ఆరోపణ. ఈ విషయంపై కేవలం పోలీసులకు ఫిర్యాదుతోనే వదిలేది లేదని, త్వరలోనే అకల్ తఖ్త్ కు కూడా ఫిర్యాదు చేయనున్నామని సిక్కు సంఘాల పెద్దలు చెబుతున్నారు. వెరసి పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించనున్న భజ్జీకి ఇవన్నీ తలనొప్పే. మరి, వీటిన్నింటి నుంచి అతడు ఎలా బయటపడతాడో చూడాలి.