: విద్యార్థి జేఏసీ నేతలపై పిడిగుద్దులు...విజయవాడ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు విద్యార్థులు యత్నించారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర కార్యాలయంలో పార్టీ సమావేశం జరుగుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం వద్దకు విద్యార్థి జేఏసీ నేతలు వెళ్లారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ప్రధాని దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించగా బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. విద్యార్థి జేఏసీ నేతలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో విద్యార్థి జేఏసీ, బీజేపీలకు చెందిన నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకున్నారు. విద్యార్థి జేఏసీ నేతలపై బీజేపీ నేతలు పిడిగుద్దులు కురిపించారు. అక్కడి నుంచి వారిని తరిమికొట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా హామీని మరవడంపై విద్యార్థి జేఏసీ నాయకులు మండిపడ్డారు. హామీ అమలు చేయకపోతే ఊరుకునే ప్రస్తక్తే లేదని అన్నారు.