: ప్రజల దృష్టిలో బీజేపీ 'ఆశాకిరణం': మోదీ
బీహార్ ప్రజలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను ఓ ఆశాకిరణంలా చూస్తున్నారని, వారు మార్పును కోరుకుంటున్నారని తనకు స్పష్టంగా తెలుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం మధుబని ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. అంతకుముందు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేస్తూ, బీహార్ వాతావరణంలో మార్పు కనిపిస్తోందని, భవిష్యత్ ఆశాకిరణంగా తమ పార్టీని చూస్తున్నారని అన్నారు. మధుబని సభలో ప్రసంగిస్తూ, ఇంతకాలమూ రాష్ట్రంలో గూండారాజ్యం కొనసాగిందని, ఇప్పుడు రాజ్యాన్ని 'గూండా కవలలు' పాలించాలని చూస్తున్నారని నితీష్, లాలూలను ఉద్దేశించి మోదీ విమర్శించారు. ఎన్డీయేకు ఓట్లేసి అధికారంలోకి తేవాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని గత ప్రభుత్వాలు విస్మరించాయని అన్నారు. కాగా, తదుపరి ఆయన మాధేపురా, కతిహార్ ప్రాంతాల్లో జరిగే సభల్లో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. నేడు బీహారులో నాలుగవ విడత పోలింగ్ జరగనుండగా, మధ్యాహ్నం ఒంటిగంట వరకూ 40 శాతానికి మించిన పోలింగ్ నమోదైంది.