: ఇండియాకు అడ్డుగా రూపాయి విలువ, ముడిచమురు ధరలు!
వరుసగా నాలుగు వారాల పాటు లాభాలను నమోదు చేసిన భారత స్టాక్ మార్కెట్ గత వారం ఘోరంగా నష్టపోయింది. గత రెండు నెలల వ్యవధిలో అత్యధిక వారాంతపు నష్టాలను నమోదు చేసింది. దిగ్గజ కంపెనీల రెండవ త్రైమాసికం ఫలితాలు మార్కెట్ వర్గాల సెంటిమెంటును దెబ్బతీయడంతో పాటు రూపాయి విలువ పతనం, ముడిచమురు ధరల సరళి తదితరాంశాలు, కొత్తగా ఈక్విటీల కొనుగోలుకు అడ్డుగా నిలిచాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. కాగా, అక్టోబర్ 30తో ముగిసిన వారాంతానికి బీఎస్ఈ సెన్సెక్స్ 814 పాయింట్లు పడిపోయి 2.96 శాతం నష్టంతో 26,657 పాయింట్లకు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 230 పాయింట్లు పడిపోయి 2.77 శాతం నష్టంతో 8,066 పాయింట్లకూ చేరుకున్నాయి. సెప్టెంబర్ 4తో ముగిసిన వారాంతం తరువాత ఈ స్థాయిలో నష్టాలు నమోదు కావడం ఇదే తొలిసారి. బీఎస్ఈ-30, ఎన్ఎస్ఈ-50 సూచికలతో పాటు మిడ్ కాప్ 1.5 శాతం, స్మాల్ కాప్ 1.8 శాతం దిగజారడం ఆందోళనను పెంచుతోంది. అమెరికా వడ్డీ రేట్లను పెంచకపోవడం, ఇదే సమయంలో చైనాలో వడ్డీ రేట్లతో పాటు సీఆర్ఆర్ (క్యాష్ రిజర్వ్ రేషియో - నగదు నిల్వల నిష్పత్తి) సవరణల పట్ల ఇన్వెస్టర్లు నిరుత్సాహంగా ఉన్నారని కోటక్ సెక్యూరిటీస్ ప్రతినిధి దీపేన్ షా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బీహారులో జరుగుతున్న ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తే స్టాక్ మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్ పెరుగుతుందని, ఓడిపోతే మాత్రం సంస్కరణల అమలు ఆలస్యమవుతుందన్న భయాలు పెరిగి మరింత నష్టాలు సంభవించవచ్చని ఆయన అంచనా వేశారు. ఇదిలావుండగా, గత వారంలో సెన్సెక్స్-30లోని 20 కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. యాక్సిస్ బ్యాంకు అత్యధికంగా 10 శాతం పడిపోయింది. బ్యాంకు వద్ద రూ. 1,820 కోట్లను రుణంగా తీసుకున్న రెండు విద్యుత్ రంగ కంపెనీలు దాన్ని తిరిగి చెల్లించడంలో విఫలం కావడం, ఆపై రుణాన్ని నిరర్థక ఆస్తుల జాబితాలో బ్యాంకు చేర్చడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇక సోమవారం తరువాత ఎస్బీఐ, టాటా కాపిటల్, సిప్లా, బీహెచ్ఈఎల్, ఓఎన్జీసీ, డీఎల్ఎఫ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర సంస్థలు తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఈ కంపెనీల ఫలితాల సరళి మార్కెట్ గమనాన్ని ప్రభావితం చేయవచ్చని అంచనా.