: సీఎం భద్రతకు ఉండాల్సిన పోలీసులు... డ్యూటీ వదిలి హీరో ప్రభాస్ ఇంటికి వెళ్లిపోయారు!
తెలంగాణ సీఎం సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్న కొంతమంది పోలీసులకు సంబంధించిన ఓ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే, సీఎం కేసీఆర్ నిన్న (శుక్రవారం) హైదరాబాదులోని మాదాపూర్ వైపు వెళుతున్నట్టు జూబ్లీహిల్స్ పోలీసులకు ఎప్పటిలానే ముందస్తు సమాచారం అందింది. అంటే ఆ ప్రాంతంలో ముందుగా పోలీసులు బందోబస్తు నిర్వహించాలి. కానీ, ఆ సమయంలో అదే మార్గంలో ఉన్న సినీ నటుడు ప్రభాస్ ను చూసేందుకు (ఇటీవలే ఫారిన్ టూర్ నుంచి హైదరాబాద్ తిరిగొచ్చాడు) ఆయన నివాసానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని పోలీసులకు తెలిసింది. దాంతో ప్రభాస్ ను చూసేందుకు, కొంతమంది పోలీసులు తమ డ్యూటీని వదిలేసి ఉత్సాహంగా వెళ్లిపోయారు. ఈ విషయం ఆలస్యంగా ఉన్నతాధికారులకు తెలియడంతో సదరు పోలీసులను పిలిచి గట్టిగా క్లాస్ తీసుకున్నారట. జరిగిన ఘటనపై పూర్తిస్థాయి నివేదిక కూడా ఇవ్వాలని ఆదేశించినట్టు తెలిసింది.