: మీ ఇంట్లో చెత్త పేరుకుపోయిందా?... నో ప్రాబ్లం... 'కబాడీవాలా'కు చెప్పండి!
మీ ఇంటి నిండా న్యూస్ పేపర్లు, పుస్తకాలు, ప్లాస్టిక్ వస్తువులు, సీసాలు పేరుకుపోయాయా? సాధారణంగా అయితే పేపర్లు కొనేవాడు వస్తే కాని మీ ఇంట్లోని చెత్త ఖాళీ కాదు. అందుకే పేపర్లు కొనేవాడు ఎప్పుడొస్తాడా అంటూ ఎదురుచూస్తా ఉంటాం. ఈ సమస్యలో నుంచే అద్భుతమైన ఐడియా పుట్టింది అనురాగ్ అసతి అనే యువకుడికి. భోపాల్ ఐఐటీ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న ఇతనికి యూనివర్శిటీ క్యాంపస్ లో చివరి రోజు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇంటికి వెళ్లేటప్పుడు పాత నోట్ బుక్స్, పేపర్లు, మేగజీన్స్, ప్లాస్టిక్ బాటిల్స్ వంటి ఎంతో చెత్త తనతోపాటు మిగిలిపోయింది. ఇదంతా తీసుకుపోవడం ఎలా? ఎవరికైనా ఫోన్ చేస్తే, వచ్చి ఇదంతా కొనుక్కొని పోతే ఎంత బాగుంటుంది? అనే ఆలోచన కలిగింది. అంతే... క్యాంపస్ నుంచి బయటకు రాగానే 2013లో 'కబాడీవాలా.కామ్' అనే ఆన్ లైన్ సంస్థను ప్రారంభించాడు. పేపర్లు, పుస్తకాలు, ఇనుము, ప్లాస్టిక్, కాపర్ వంటి చెత్తనంతా తీసుకోవడమే ఈ వెబ్ సైట్ యొక్క వ్యాపారం. చెత్త రకాన్ని బట్టి కిలో రూ. 8 నుంచి కొంటారు. ప్రస్తుతం భోపాల్ లో సేవలు అందిస్తున్న ఈ సంస్థ మరో 4 నెలల్లో బెంగళూరు, హైదరాబాద్, పూణె, ఢిల్లీ, గుర్గావ్, ముంబై వంటి 15 నగరాలకు విస్తరించబోతోంది. తమ వ్యాపారంలో కోటి రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ఓ సంస్థ ముందుకు వచ్చిందని అనురాగ్ తెలిపారు. ప్రస్తుతం ఈ వెబ్ సైట్ లో 10 వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు. కేవలం ఇళ్లనుంచే కాకుండా సంస్థలు, దుకాణాలు, సంఘాల నుంచి కూడా వీరు చెత్తను కొంటున్నారు. ఐసీఐసీఐ, మ్యాక్స్ లాంటి 30కి పైగా సంస్థలతో కబాడీవాలా.కామ్ ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాకుండా ఈ చెత్తనంతా రీసైకిల్ చేసేందుకు రీసైక్లింగ్ యూనిట్లతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు.