: మా రాష్ట్రానికీ రండి... ఫ్లిప్ కార్ట్ సీఓఓకు సిక్కోలు ఎంపీ రామ్మోహన్ నాయుడి విజ్ఞప్తి
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ నిన్న రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లిలో అతిపెద్ద ఆటోమేటెడ్ గిడ్డంగిని ప్రారంభించింది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బిన్ని బన్సల్ సమక్షంలో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గిడ్డంగిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువనేత, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు తళుక్కున మెరిశారు. కార్యక్రమంలో భాగంగా రామ్మోహన్ నాయుడికి బిన్ని బన్సల్ జ్ఞాపికను కూడా అందజేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తమ రాష్ట్రంలోనూ కార్యకలాపాలను విస్తరించాలని ఫ్లిప్ కార్ట్ ను కోరారు. యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఫ్లిప్ కార్ట్ లాంటి సంస్థలకు తాము అన్ని రకాలుగా సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రామ్మోహన్ నాయుడి వినతికి బిన్ని బన్సల్ సానుకూలంగా స్పందించారు.