: వైట్ హౌస్ లో పేలుళ్లంటూ హ్యాకర్ల ట్వీట్
హ్యాకర్ల ఆగడాలు అదుపు తప్పుతున్నాయి. ఇన్నాళ్లూ ఫేస్ బుక్, ట్విట్టర్ తదితర సోషల్ నెట్ వర్క్ సైట్లలోకి చొరబడి విలువైన సమాచార తస్కరణకే పరిమితమైన వీరు తొలిసారిగా అలజడి రేపేందుకు ప్రయత్నించారు. అసోసియేటెడ్ ప్రెస్(ప్రముఖ వార్తా సంస్థ)కు చెందిన ట్విట్టర్ అకౌంట్ ను దుండగులు హ్యాక్ చేశారు. అంతటితో ఆగకుండా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో బాంబు పేలుళ్లు జరిగాయంటూ అందులోంచి ట్వీట్ చేసేసారు. పేలుళ్లలో అధ్యక్షుడు ఒబామాకు గాయాలయ్యాయంటూ అలజడి రేపారు.
దీంతో అంతటా ఆందోళన మొదలైంది. అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లాయి. ఎఫ్ బిఐ పోలీసులు రంగంలోకి దిగారు. పేలుళ్లు ఏమీ లేవని తెలుసుకుని కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇది తెలుసుకున్న వెంటనే అసోసియేటెడ్ ప్రెస్ తన ఖాతాను నిలిపివేసింది. మరోవైపు హ్యాకర్లు అసోసియేటెడ్ ప్రెస్ ఖాతాను ఎలా హ్యాక్ చేశారన్న దిశగా ఎఫ్ బిఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.