: కమలహాసన్ కు పాదాభివందనం చేసిన రాజ్ థాకరే కుమార్తె ఊర్వశి
దక్షిణాది సూపర్ స్టార్ కమలహాసన్ ఈ ఉదయం మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే నివాసానికి వెళ్లాడు. ముంబైలోని కృష్ణకుంజ్ రెసిడెన్స్ కు ఆయన చేరుకోగా, థాకరేతో పాటు ఆయన భార్య షర్మిల, కుమార్తె ఊర్వశి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కమలహాసన్ ఆశీర్వాదం కోసం ఊర్వశి ఆయనకు పాదాభివందనం చేశారు. మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం, తన ఇంటికి వచ్చిన కమల్ ను థాకరే బంగారు వర్ణంలో ఉన్న శాలువా కప్పి, పుష్పగుచ్ఛమిచ్చి తన ఇంటిలోకి స్వాగతం పలికారు. కమల్, థాకరేల కలయికలో ప్రత్యేకత ఏమీ లేదని ఎంఎన్ఎస్ కార్యకర్తలు తెలిపారు. కేవలం మర్యాదపూర్వక కలయికేనని, కమల్ ఎంఎన్ఎస్ లో చేరనున్నారని వస్తున్న వార్తలు పుకార్లేనని స్పష్టం చేశారు.