: శబరిమలలో తెలంగాణకు స్థలం కేటాయించేందుకు కేరళ సర్కారు అంగీకారం
శబరిమలలో తెలంగాణకు ఐదెకరాల స్థలం కేటాయించేందుకు కేరళ ప్రభుత్వం అంగీకరించింది. తెలంగాణ నుంచి వచ్చే అయ్యప్ప భక్తుల కోసం ఆ స్థలంలో ప్రత్యేక భవనాన్ని నిర్మించనున్నారు. ఈ మేరకు తిరువనంతపురంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల దేవాదాయ శాఖ మంత్రుల సమావేశంలో తెలంగాణ నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, దేవాదాయ శాఖ సెక్రెటరీ శివశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో స్థల కేటాయింపుపై అనుమతి లభించింది. అంతేగాక నవంబర్ లో గురుస్వాములతో హైదరాబాద్ లో ప్రత్యేకంగా సదస్సును నిర్వహించేందుకు కూడా కేరళ అధికారులు ఒప్పుకున్నారు. తెలంగాణ భక్తులకు భాషాపరమైన సమస్య తలెత్తకుండా కూడా శబరిమలలో తెలుగు మాట్లాడేవారితో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. తెలంగాణకు ఐదెకరాల స్థలం కేటాయించినందుకు గానూ కేరళ సీఎం ఉమన్ చాందీకి ఇంద్రకరణ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. స్థల కేటాయింపుపై ఉత్తర్వులు వచ్చిన తరువాత కేరళ, తెలంగాణ ప్రభుత్వాలు ఒప్పందం చేసుకుంటాయి.