: జైలు ఊచలు విరవండి, ట్రోఫీ తయారుచేసుకుంటాం... రెండు దేశాలకు బీసీసీఐ విజ్ఞప్తి
త్వరలో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ప్రారంభం కానున్న "ఫ్రీడం సిరీస్" టెస్ట్ మ్యాచ్ ల అనంతరం విజేతలకు ఇచ్చే ట్రోఫీ వినూత్నంగా ఉండాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ సిరీస్ మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలాలను గుర్తు చేసుకుంటూ సాగుతున్న నేపథ్యంలో ట్రోఫీ తయారీ కోసం గతంలో వారు మగ్గిన జైలు గదుల ఊచలు కావాలని అడుగుతోంది. స్వాతంత్ర్యం కోసం ఉద్యమిస్తున్న వేళ గాంధీని బందీగా ఉంచిన పుణెలోని ఎరవాడ జైలు గది నుంచి, ఆపై మండేలా ఏళ్లపాటు కాలం గడిపిన రాబిన్ ఐలాండ్ జైలు గది నుంచి ఊచలను పీకి ఇవ్వాలని బీసీసీఐ ఇప్పటికే లేఖలు రాసింది. ఈ మేరకు శశాంక్ మనోహర్ పుణెలోని జైళ్ల డీజీకి స్వయంగా లేఖ రాశారు. కాగా, ఈ లేఖపై ఇప్పటికింకా నిర్ణయం తీసుకోనప్పటికీ, టెస్టు మ్యాచ్ ట్రోఫీ గాంధీ, మండేలా నివసించిన జైలు గదుల ఊచలతోనే తయారవుతుందని సమాచారం.