: ‘హోదా’ కోసం మరో బలిదానం...ఆగస్టులో ఆత్మహత్యాయత్నం చేసిన దుర్గా ప్రసాద్ కన్నుమూత
ఏపీకి ప్రత్యేక హోదా కోసం మరో వ్యక్తి ఆత్మ బలిదానం చేశాడు. రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే కోలుకుంటుందని, ఈ మేరకు కేంద్రం తక్షణమే ప్రత్యేక హోదాను ప్రకటించాలని ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఆగస్టు 24న పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరులో దుర్గా ప్రసాద్ (42) అనే వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన దుర్గా ప్రసాద్ గుంటూరు, విజయవాడ, హైదరాబాదు, ఏలూరు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నాడు. ఏ ఒక్క చోట కూడా అతడి ఆరోగ్యం మెరుగుపడలేదు. చివరికి ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు నేటి ఉదయం కన్నుమూశాడు. దుర్గా ప్రసాద్ కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.