: ప్రేమికుడితో వెళ్లిపోయిన గాయని మధుప్రియ... పెళ్లికి అభ్యంతరం చెబుతున్న పేరెంట్స్... పోలీస్ స్టేషన్ చేరిన వివాదం!


"ఆడపిల్లనమ్మా... నేను ఆడపిల్లనని..." అంటూ ఆర్ద్రతతో మధుప్రియ పాట పాడితే టీవీ ముందు కూర్చున్న వాళ్లు కన్నీరు పెడతారు. సమాజంలో స్త్రీల దుర్భర స్థితిపై గొంతెత్తి పాటలు పాడడమే కాకుండా, తెలంగాణ ఉద్యమంలో సైతం తన గొంతుక వినిపించిన చిన్నారి గాయని మధుప్రియ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఇంటి పక్కనే ఉన్న యువకుడు శ్రీకాంత్ తో ప్రేమలో పడ్డ మధుప్రియ అతడితో పెళ్లికి సిద్ధపడింది. తల్లిదండ్రులకు చెప్పాపెట్టకుండా ప్రియుడితో కలిసి అతడి స్వస్థలం ఆదిలాబాదు జిల్లా కాగజ్ నగర్ కు చెక్కేసింది. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు కూడా కాగజ్ నగర్ కు పరుగులు పెట్టారు. చిన్న వయసులో పెళ్లేమిటని వారించిన తల్లిదండ్రులపై మధుప్రియ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాక, మేజర్ ను అయిన తాను తన ఇష్టం వచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు ఉందని కూడా వాదిస్తోందట. ప్రస్తుతం ఈ వ్యవహారంలో మధుప్రియ, శ్రీకాంత్ కుటుంబాలు కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్ గడప తొక్కాయి. పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. మధుప్రియ మాత్రం తన ప్రియుడి వైపే నిలబడి, తన తల్లిదండ్రుల మాటలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదని తెలుస్తోంది. హైదరాబాదులోని న్యూ నల్లకుంటలో మధుప్రియ కుటుంబం నివాసం ఉంటోంది. వారి ఇంటి పక్కనే ఉన్న శ్రీకాంత్ తో మధుప్రియకు రెండేళ్ల క్రితం ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో పెళ్లికి సిద్ధపడ్డ ప్రేమ జంట చెప్పాపెట్టకుండా శ్రీకాంత్ సొంతూరు కాగజ్ నగర్ చెక్కేసింది. వీరి పెళ్లికి శ్రీకాంత్ కుటుంబం పూర్తి మద్దతు పలికినట్లు సమాచారం. ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ చేరిన నేపథ్యంలో ఈ వివాదం ఎంతదూరం వెళుతుందో చూడాలి.

  • Loading...

More Telugu News