: ఏపీ సర్కారు కొత్త ఎత్తు!... రైతులకు 'రుణ మాఫీ సర్టిఫికెట్లు'... ఎలాగంటే!


ఆంధ్రప్రదేశ్ లో రైతుల రెండవ విడత రుణామాఫీకి చంద్రబాబు సర్కారు కొత్త ప్రతిపాదనలతో ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా రైతుల అప్పులను ప్రత్యక్షంగా ప్రభుత్వం తీర్చదు. ఇందుకు బదులుగా రైతులకు 'రుణ మాఫీ సర్టిఫికెట్లను' అందిస్తామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. వీటిపై ఏపీ సర్కారు 10 శాతం వడ్డీని ఇస్తుందని తెలిపారు. స్తోమత కలిగిన రైతులు వీటిని భవిష్యత్ అవసరాల కోసం దాచుకోవచ్చని, డబ్బు కావాలనుకున్న వారు వీటిని బ్యాంకులకు ఇచ్చి నగదు పొందవచ్చని వివరించారు. ఇప్పటివరకూ 54,06,000 మందికి రుణమాఫీ చేశామని ఆయన వెల్లడించారు. మొదటి విడతగా రూ. 7,433 కోట్ల రైతుల రుణాలను మాఫీ చేశామని ప్రత్తిపాటి తెలిపారు. రెండవ విడతలో రూ. 4,300 కోట్లను కొత్త విధానంలో మాఫీ చేయనున్నట్టు వివరించారు. అయితే, ఈ సర్టిఫికెట్లకు లాకిన్ పీరియడ్ ఉంటుందా? ఒకేసారి అందరు రైతులూ వచ్చి డబ్బు కావాలని అడిగితే, ఖజానా పరిస్థితి ఏంటి? రుణం చెల్లించామని రైతులకు ఓ కాగితం ఇస్తే సరిపోతుందా? బ్యాంకులు డబ్బు కట్టాలని వస్తే? ఆ డబ్బు బ్యాంకులకు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది? ఆ డబ్బే ఉంటే ప్రత్యక్షంగా రుణమాఫీ చేయొచ్చు కదా? ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రం ప్రత్తిపాటి వెల్లడించలేదు.

  • Loading...

More Telugu News