: పాక్ లో భారత హైకమిషనర్ కు అవమానం
పాకిస్థాన్ లోని భారత హైకమిషనర్ టీసీఏ రాఘవన్ కు అవమానం ఎదురైంది. ఆయనను, ఆయన భార్యను అనుమతించలేమంటూ కరాచీలోని ప్రముఖ సింధ్ క్లబ్ తెగేసి చెప్పింది. దీంతో ఆయన షాక్ కు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే, గత నెల 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పాకిస్థాన్-ఇండియా ఫ్రెండ్ షిప్ ఫోరం సింధ్ క్లబ్ లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం భారత్ కు చెందినది కావడంతో రాఘవన్ కు ఆహ్వానం అందింది. దీంతో, ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి కరాచీ చేరుకున్నారు. అయితే, తమ క్లబ్ లోకి రాఘవన్ ను అనుమతించమంటూ చివరి నిమిషంలో క్లబ్ యాజమాన్యం తెలిపింది. దీంతో, రాఘవన్ కరాచీ నుంచి ఇస్లామాబాద్ కు వెనుదిరిగారు. ముంబైలో పాక్ గజల్ గాయకుడు గులాం అలీ సంగీత కార్యక్రమాన్ని అనుమతించనందువల్లే... ప్రతీకార చర్యలో భాగంగా ఈ పని చేసి ఉంటారని అధికార వర్గాలు భావిస్తున్నాయి.