: సెక్రటేరియట్ లో బాలయ్య... లేపాక్షి ఉత్సవాలకు రంగం సిద్ధం చేస్తున్న వైనం
రాజకీయ నేతగా మారిన టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ పనితీరులో అనంతపురం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులందరికంటే మెరుగైన రీతిలో ఉన్నారు. పనితీరు ఆధారంగా తన బావ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తయారుచేసిన నివేదికలో అనంతపురం జిల్లాలోనే ఆయన ప్రథమ స్థానంలో నిలిచారు. తనను గెలిపించిన అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన అహరహం శ్రమిస్తున్నారు. ఇక విషయానికొస్తే, నిన్న బాలయ్య హైదరాబాదులోని ఏపీ సచివాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఒంటరిగా సచివాలయానికి వచ్చిన బాలయ్య నేరుగా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు చాంబర్ కు వెళ్లారు. అనంతపురం జిల్లాల్లో రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న లేపాక్షి ఉత్సవాలపై ఆయన మంత్రితో చర్చించారు. ఈ దఫా లేపాక్షి ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించామని, ఇందుకోసం ప్రభుత్వం నుంచి సహకారం కావాలని ఆయన కోరారు. తన నియోజకవర్గం ఉన్న జిల్లాపై బాలయ్య చూపుతున్న ఆసక్తికి ముగ్ధుడైన మంత్రి మాణిక్యాలరావు వెనువెంటనే తలూపారు. లేపాక్షి ఉత్సవాలకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని బాలయ్యకు హామీ ఇచ్చారు.