: 3 రోజులుగా తణుకులోనే వెస్ట్ గోదావరి ఎస్పీ...అయినా చిక్కని ‘కృపామణి’ నిందితులు
తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన కృపామణి ఆత్మహత్య కేసులో నేటికీ నిందితుల జాడ లేదు. తల్లిదండ్రులు, సోదరుడు, రౌడీ షీటర్ వేధింపుల కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో కృపామణి అనే గృహిణి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు తాను అనుభవించిన నరకయాతనను సూసైడ్ నోట్ లో రాయడమే కాక సెల్ఫీ వీడియోలో రికార్డు చేసి మరీ ఆమె తనువు చాలించింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా ఈ కేసుపై దృష్టి సారించిన నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ మూడు రోజులుగా తణుకులోనే మకాం పెట్టారు. అయినా నిందితుల జాడ తెలియలేదు. ఇదిలా ఉంటే, కృపామణిని వేధింపులకు గురి చేసిన రౌడీ షీటర్ సాయి శ్రీనివాస్ కు స్థానిక పోలీసులతో మంచి సంబంధాలున్నాయట. ఈ క్రమంలోనే అతడు పోలీసులకు చిక్కకుండా చాకచక్యంగా తప్పించుకుంటున్నాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.