: ‘సీమ’పై నారా లోకేశ్ కన్ను... కోస్తాంధ్రపై జగన్ దృష్టి
ప్రతిపక్షం వైసీపీకి గట్టి పట్టున్న రాయలసీమ జిల్లాల్లో టీడీపీ పటిష్టతపై ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ దృష్టి సారించారు. నిన్నటి నుంచి నేరుగా రంగంలోకి దిగిన ఆయన పార్టీ ఏపీ శాఖ ప్రధాన కార్యదర్శులకు ఆయా జిల్లాల బాధ్యతలను అప్పగించారు. నేటి ఉదయం పార్టీ ఉపాధ్యాయ విభాగం నేతలతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏపీలో ప్రత్యేకంగా రాయలసీమలో పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా ఆయన కీలక దృష్టి సారించారు. ఇక వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీడీపీకి గట్టి పట్టున్న కోస్తాంధ్రలో తన పార్టీని బలోపేతం చేసుకునే దిశగా చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు ఆయన కొద్దిసేపటి క్రితం ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో హైదరాబాదులో భేటీ అయ్యారు. ఆయా జిల్లాల్లో పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై ఆరా తీశారు. భవిష్యత్తులో ఆ జిల్లాల్లో పార్టీకి మరిన్ని సీట్లు వచ్చేలా చూసేందుకు ఎలాంటి వ్యూహం అవలంబించాలన్న అంశంపై ఆయన పార్టీ నేతల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు.