: 8 మంది కిడ్నాపర్లకు హ్యాండిచ్చిన బీజేపీ నేత కుమారుడు!
హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని అలియాబాద్ లో మాయమైన బీజేపీ నాయకుడు పొన్న వెంకటరమణ కుమారుడు శబరీష్ (15) కిడ్నాప్ కథ సుఖాంతమైంది. బాపట్ల వద్ద రైలులో ఏడుస్తున్న బాలుడిని గమనించిన ప్రయాణికులు రైల్వే పోలీసులకు అప్పగించడంతో వారు విచారించి హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. తనను 8 మంది నోటికి గుడ్డ కట్టి కిడ్నాప్ చేశారని, సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో వారి దృష్టిని మరల్చి విశాఖపట్నం వెళుతున్న రైలెక్కానని శబరీష్ పోలీసులకు తెలిపాడు. తిరిగి హైదరాబాద్ వచ్చేందుకు 'బొకారో' ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కినట్టు తెలిపాడు. మార్గమధ్యంలో దిక్కుతోచక ఏడుస్తుంటే, కొందరు తనను వివరాలు అడిగి పోలీసులకు అప్పగించినట్టు శబరీష్ వివరించాడు. కాగా, పదో తరగతి చదువుతున్న శబరీష్ ఆదివారం సాయంత్రం ఆడుకునేందుకు వెళ్లి, మాయం కాగా, పోలీసులు దర్యాఫ్తు చేపట్టిన సంగతి తెలిసిందే.