: సద్దాం హుస్సేన్, గడాఫీలు బతికుంటే బాగుండేది: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్
తదుపరి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరపున బరిలో ఉంటారని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ నియంతలుగా ముద్రపడ్డ సద్దాం హుస్సేన్, గడాఫీలు బతికుండి, ఇప్పటికీ అధికారంలో ఉంటే ప్రపంచం మరింత మెరుగైన స్థితిలో ఉండేదని అన్నారు. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఘోరంగా మారడానికి అధ్యక్షుడు ఒబామా, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ కారణమని ఆరోపించారు. "ఇరాక్, లిబియా దేశాల్లో సద్దాం, గడాఫీలు ఇప్పటికీ ఉండివుంటే 100 శాతం ప్రపంచం బాగుండేది" అన్నారు. కాగా, 2003లో ఇరాక్ పై అమెరికా దాడి తరువాత 2006లో సద్దాం హుస్సేన్ ను ఉరితీసి చంపగా, లిబియాను నాలుగు దశాబ్దాల పాటు పాలించిన గడాఫీని అక్టోబర్ 2011లో పదవి నుంచి దింపి హతమార్చిన సంగతి తెలిసిందే. వారి పాలనలో కన్నా ఇప్పుడు ఆ దేశాల్లోని ప్రజలు మరింతగా ఇబ్బందులు పడుతున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. "నా ఉద్దేశం ఏమంటే... ఇప్పుడు చూడండి ఏమయిందో... లిబియా, ఇరాక్ లు అట్టుడుకుతున్నాయి. సిరియా మరింత ఘోరంగా మారింది. మొత్తం మీద మధ్య ప్రాచ్య దేశాలు హిల్లరీ, ఒబామాల కారణంగా రగులుతున్నాయి. అమెరికా ఉగ్రవాదులకు స్థావరాలను, వారికి శిక్షణ ఇచ్చే కేంద్రాలనూ ఈ దేశాల్లో నిర్మించి వారి చేతులకే అప్పగించింది" అని నిప్పులు చెరిగారు. తాను సద్దాం మంచి వాడని అనడం లేదని, అతను క్రూరుడే అయినప్పటికీ, బతికుంటే ఇరాక్ లో ఈ పరిస్థితి ఉండేది కాదని వివరించారు.